తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం

  • తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త వీక్లీ రైళ్లు
  • కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి నుంచి ఈ రైళ్లు నడపనున్నట్టు వెల్లడి
  • తిరుపతి, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన వైనం
తెలంగాణ ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. ఈ రైళ్లు హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూర్, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి కీలక నగరాలకు రాకపోకలు సాగిస్తాయి.

ఈ కొత్త రైళ్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి నిరంతరం సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త రైళ్లు రాష్ట్ర అభివృద్ధికి, పౌరుల సౌకర్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా ప్రకటించిన రైళ్ల పూర్తి వివరాలు:

1.ట్రైన్ నెం. 17607/17608: కాచిగూడ - తిరుచానూర్ (ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు, మే 15 నుంచి ప్రారంభం)
2.ట్రైన్ నెం. 17601/17602: కాచిగూడ - శ్రీ గంగానగర్ (ప్రతి శనివారం రాత్రి 10:00 గంటలకు, జులై 14 నుంచి ప్రారంభం)
3.ట్రైన్ నెం. 17047/17048: చర్లపల్లి - తిరుచానూర్ (ప్రతి బుధవారం సాయంత్రం 6:55 గంటలకు, మే 7 నుంచి ప్రారంభం)
4.ట్రైన్ నెం. 17441/17442: చర్లపల్లి - తిరుపతి (ప్రతి బుధవారం రాత్రి 9:20 గంటలకు, మే 14 నుంచి ప్రారంభం)
5.ట్రైన్ నెం. 17443/17444: చర్లపల్లి - తిరుపతి (ప్రతి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు, మే 15 నుంచి ప్రారంభం)
6.ట్రైన్ నెం. 17059/17060: చర్లపల్లి - తిరుచానూర్ (ప్రతి ఆదివారం రాత్రి 9:15 గంటలకు, మే 11 నుంచి ప్రారంభం)
7.ట్రైన్ నెం. 17067/17068: చర్లపల్లి - భువనేశ్వర్ (ప్రతి సోమవారం సాయంత్రం 6:10 గంటలకు, మే 5 నుంచి ప్రారంభం)
8.ట్రైన్ నెం. 17079/17080: నాంపల్లి - జైపూర్ (ప్రతి శుక్రవారం రాత్రి 7:50 గంటలకు, ప్రారంభ తేదీ ప్రకటించాల్సి ఉంది)

Trains
Weekly Trains
Telangana
Kishan Reddy
SCR
Indian Railways

More Telugu News